కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామిని సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారు. అయితే, స్వామివారి దర్శనానికి వివిధ మార్గాలు ఉన్నాయి. సర్వదర్శనం, ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం ఇలా పలు మార్గాల్లో వెంకన్న దర్శనం చేసుకుంటారు. ఈ క్రమంలో తాజాగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు టీటీడీ నిలిపివేసింది. ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదల కానుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) ఈ నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి దర్శనానికి నిత్యం తరలివచ్చే వేలాదిమంది భక్తుల కోసం సర్వ దర్శనం, ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వీఐపీ దర్శనాలు ఉంటాయి. ముఖ్యంగా.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ప్రముఖులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వారి పరివారం వీఐపీ బ్రేక్, శ్రీవారి ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వారి బంధువులు, అనుచరులు, నియోజకవర్గ ప్రజలు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు. ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రతి రోజు ఉదయం సమయంలో ఉంటాయి. సిఫార్సు లేఖలను తీసుకెళ్లే భక్తులు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో దర్శనం కోసం అభ్యర్థన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. టీటీడీ అధికారులు రద్దీని దృష్టిలో పెట్టుకుని దర్శనాలకు స్లాట్‌లు కేటాయిస్తారు. ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, కేంద్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సులపై వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేస్తుంటారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా ఉంది.
అయితే, ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో దీనికి సంబంధించి శనివారం షెడ్యూల్ వెలువడనుంది. దాంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. ఈ క్రమంలో నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు ప్రజాప్రతినిధులుకు ఇప్పటికే సమాచారం అందించింది. ఎన్నికల తేదీలు రానుండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరాదని నిర్ణయం తీసుకుంది. కానీ, సిఫార్సు లేఖలు అనుమతించనప్పటికీ.. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తే మాత్రం బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. అంటే, దాదాపు రెండు నెలల పాటు బ్రేక్ దర్శనాలు నిలిచిపోనున్నాయి. దీని వల్ల సామాన్యులకు కొంత ఊరట కలుగుతుంది.