దాదాపు రెండేళ్ల కిందట దుండుగులు జరిపిన కాల్పుల్లో పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. స్నేహితులతో కలిసి కారులో వెళుతున్న సిద్దూపై ప్రత్యర్థులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సిద్ధూ అక్కడికక్కడే చనిపోయాడు. పంజాబ్‌తో పాటు దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న గాయకుడి హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆయన అభిమానులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి.. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సిద్ధూ మూసేవాలా అలియాస్ శుభ్ దీప్ సింగ్ మళ్లీ పుట్టాడు. అవును 58ఏళ్ల వయసులో అతడి తల్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఒక్కగానొక్క కొడుకు హత్యకు గురవడంతో సిద్ధూ తల్లి 58 ఏళ్ల చరణ్ కౌర్ సాహసం చేశారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చి.. బిడ్డను కన్నారు. ఈ విషయాన్ని సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్.. సోషల్ మీడియాలో తెలియజేశారు. ఒడిలో పసికందుతో బాల్కౌర్ సింగ్ పోస్టు చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవుడి దయ, సిద్ధూ అభిమానుల ఆశీస్సులు, శ్రేయోభిలాషుల దీవెనలతో తమకు కొడుకు పుట్టాడని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.
సిద్ధూ మూసేవాలా ఫొటో పక్కన ఒడిలో బాబుతో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై సిద్ధూ అభిమానులు స్పందిస్తూ సంతోషంగా కామెంట్లు పెడుతున్నారు. సిద్ధూ భాయ్ మళ్లీ వచ్చాడంటూ సంబరపడిపోతున్నారు. ఇక, సిద్ధూ మూసేవాలా హత్య వెనుక కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ముఠాల మధ్య ఉన్న శత్రుత్వమే దీనికి కారణమని పేర్కొన్నారు. గన్ కల్చర్, వివాదాస్పద సాహిత్యం, మతపరమైన మనోభావాలను కించపరచడం వంటి విమర్శలను సిద్ధూ ఎదుర్కొన్నాడు, ముఖ్యంగా సిక్కుల్లో గౌరవనీయమైన వ్యక్తి మై భాగో గురించి చేసిన వ్యాఖ్యలతో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు.