ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువరాణి కేట్‌ మిడిల్టన్‌ అదృశ్యం.. బ్రిటన్ రాజకుటుంబంలో ఏం జరుగుతోంది?

international |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2024, 10:25 PM

బ్రిటన్ రాజకుటుంబంలో జరుగుతున్న పరిణామాలు వారి అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా యువరాణి కేట్‌ మిడిల్టన్‌ బయట ప్రపంచానికి కనిపించడం లేదు. ఆమె అదృశ్యంపై రోజుకో ప్రచారం తెరపైకి వస్తోంది. పొత్తి కడుపులో సమస్యకు శస్త్రచికిత్స చేయించుకున్నారని ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం జనవరిలో ప్రకటించింది. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని, త్వరలోనే విధుల్లో పాల్గొంటారని తెలిపింది. కానీ, ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో ఆమె కోమాలో ఉన్నారని, మరొకరితో యువరాజు విలియం ప్రేమాయణం నడుపుతుండటమే అందుకు కారణమని.. ఇలా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


ఇటీవల కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ విడుదల చేసిన ఎడిటెడ్‌ ఫొటోతో అవి మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో లండన్‌లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికాకు చెందిన న్యూయార్క్‌ పోస్ట్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. కేట్‌ మిడిల్టన్‌  వ్యవహారాలను చక్కబెట్టే చాలా మంది సీనియర్‌ సిబ్బందికి కొన్ని రోజులుగా ఆమె వివరాలేమీ తెలియడం లేదు. వాళ్లెవరూ ఇటీవల ఆమెను చూసిన, మాట్లాడిన సందర్భాలు లేవు. కెన్సింగ్టన్‌ ప్యాలెన్ ప్రకటన వచ్చే వరకు ఆమె సర్జరీ గురించీ వారికి తెలియదు. అసలేం జరుగుతుందో కొంత మందికి మాత్రమే తెలుసు. వారు మాత్రం నోరు విప్పడం లేదని, దీంతో అంతా అయోమయంగా ఉందని.. ఆందోళనకు గురిచేస్తోందని వారు అన్నట్టు న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం తెలిపింది.


కింగ్‌ ఛార్లెస్‌-III, ఆయన సతీమణి క్యామిల్లా మాత్రమే కేట్‌ను కలుస్తున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితిని చాలా రహస్యంగా ఉంచుతున్నారని చెప్పినట్టు పేర్కొంది. మరోవైపు, ఆమె త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని అధికారిక వర్గాల ద్వారా తమకు సమాచారం ఉందని ‘ది సండే టైమ్స్‌’ వెల్లడించింది. ఆ సమయంలోనే తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఆమె పంచుకునే అవకాశం ఉందని తెలిపింది. రాజకుటుంబం త్వరలో ఆమె ఫొటోను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. తన విషయంలో వస్తున్న వదంతులు, ఊహాగానాలను పట్టించుకోకుండా ప్రస్తుతం కోలుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పింది. కేట్ లేదా విలియం తన వైద్య రికార్డులను బయటపెట్టాలనుకోవడం లేదని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com