గుజరాత్ విశ్వవిద్యాలయంలోని హస్టల్‌లో మూక దాడి చోటుచేసుకుంది. ఈ దాడిలో ఐదుగురు విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. శనివారం రాత్రి ఆఫ్రికా దేశాలు, అఫ్గనిస్థాన్; ఉజ్బెకిస్థాన్ చెందిన విద్యార్థులు నమాజ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ.. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. దర్యాప్తు పారదర్శకంగా సాగాలని, వీలైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేయాలని సూచించారు. అఫ్గన్ విద్యార్ధి ఒకరు మాట్లాడుతూ... యూనివర్సిటీ ప్రాంగణంలో మసీదు లేకపోవడంతో హస్టల్‌లో మేమంతా చేరి నమాజ్ చేసుకుంటున్నామని చెప్పాడు. ఇంతలోనే కర్రలు, కత్తులతో ఓ గుంపు మాపై దాడి చేసి, ధ్వంసం చేసిందని ఆరోపించాడు.
హాస్టల్ వద్ద సెక్యూరిటీ ఆ గుంపును ఆపడానికి ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపాడు. హాస్టల్‌లో నమాజ్ చేసుకోడానికి ఎవరు అనుమతించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు చెప్పారు.‘ గదుల్లో ఉన్నవారిపై దాడిచేసి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, బైక్‌లను ధ్వంసం చేశారు’ అని మరో విద్యార్ధి వాపోయాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు విదేశీ విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు అఫ్రికా దేశీయులు, అఫ్గన్, శ్రీలంక, తుర్కిమెనిస్థాన్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఘటన జరిగిన అరగంట తర్వాత పోలీసులు వచ్చారని, వారిని చూసి అల్లరి మూక పారిపోయిందన్నారు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించి, ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధ్వంసమైన బైక్‌లు, ల్యాప్‌టాప్‌లు, చిందరవందరగా ఉన్న గదులు వీడియోల్లో కనిపిస్తోంది. అంతేకాదు, విదేశీ విద్యార్థులపై కొందరు రాళ్లు రువ్వుతూ, నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. భయపడిపోతున్న విదేశీ విద్యార్థులు.. ఇది ఆమోదయోగ్యం కాదని భయంతో పరుగులు పెడుతుండటం వీడియోల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
‘ఇది చాలా సిగ్గుచేటు.. ముస్లింలు తమ మతాన్ని శాంతియుతంగా ఆచరించినప్పుడే మీ భక్తి, మతపరమైన నినాదాలు బయటకు వస్తాయి. ముస్లింలను చూడగానే మీకు చెప్పలేనంత కోపం వచ్చినప్పుడు. సామూహిక రాడికలైజేషన్ కాకపోతే ఇది ఏమిటి? ఇది అమిత్ షా.. నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో జరిగింది.. బలమైన సందేశం పంపడానికి వారు జోక్యం చేసుకుంటారా? నాకు ఊపిరి ఆడటం లేదు..ముస్లింల పట్ల వ్యతిరేకత, ద్వేషం భారతదేశం సద్భావనను నాశనం చేస్తోంది’ అని ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు.