తరగతి గదిలో ఓ టీచర్ ఐటమ్ సాంగ్‌కు డాన్స్ ఇరగదీసింది. టీచర్ డ్యాన్సు చేస్తుంటే.. విద్యార్థులు చప్పట్లు కొడుతూ ఆమెను ప్రోత్సహిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ సినిమా బంటీ ఔర్ బబ్లీలో ఐశ్వర్యరాయ్ డ్యాన్సుచేసిన ‘కజ్‌రారే’ పాటకు టీచర్ నృత్యం చేస్తుండగా విద్యార్థులు ఆమెను ప్రోత్సహిస్తున్నారు. మధ్యలో ఆమె ఓ విద్యార్థి నుంచి ఎర్రటి దుపట్టాను తీసుకొని మరింత హుషారుగా డాన్స్ చేశారు. క్లాసులో పిల్లలు తమ టీచర్ పుట్టినరోజు జరుపుతున్న సందర్భంగా ఆమె ఈ నృత్యం చేసినట్లు తెలుస్తోంది.
క్లాస్‌రూమ్‌లోని బ్లాక్‌బోర్డ్‌పై ‘హ్యాపీ బర్త్‌డే రష్మీ మేడమ్’ అని రాసి ఉన్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేయడంతో నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ ‘సంప్రదాయాలు, విలువలకు ప్రాధాన్యమిచ్చే మన దేశంలో టీచర్ ఇలా క్లాస్ రూమ్‌లో ఐటమ్ సాంగ్‌కు డాన్స్ చేయడం సరికాదు’ అని పోస్ట్ పెట్టాడు. మరొకరు మాత్రం ఇతరులు సంతోషంగా ఉంటే కొందరు చూడలేరని, ఆమె ఆనందంలో డ్యాన్స్ చేస్తుంది.. టీచర్ అయినంత మాత్రాన ఆమెకు డ్యాన్స్ చేసే అర్హత లేదా? అమ్మాయిలు చేసే ప్రతీ పనికి తీర్పులు ఇవ్వడమే ఇక్కడి వారి పని’ అని మండిపడ్డారు. మరికొందరు స్పందిస్తూ ప్రజలు విశాల భావంతో ఉండాలని అభిప్రాయపడ్డారు.
2023 డిసెంబర్‌లో ప్రముఖ గజల్ పాట గులాబీ షరారాపై టీచర్ కాజల్ అసుదానీ తన విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో అది తరగతిలో తీసింది కాదని, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులతో కలిసి చేసిందని ఆమె వివరణ ఇవ్వాల్సి వచ్చింది.