పీచు మిఠాయి విషయంలో హిమాచల్ ప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి తయారీ, నిల్వ, విక్రయాలను ఏడాది పాటు నిషేధిస్తూ అక్కడ కాంగ్రెస్ సర్కారు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు 2025 మే 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని సోలన్, సిమ్లా, బిలాస్‌పూర్ సహా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పీచు మిఠాయి నమూనాలను పరీక్షించిన ఆహార భద్రత అధికారులు వీటిలో హానికారక రంగులు కలుపుతున్నట్లు గుర్తించారు. ఇవి ఆహార భద్రత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నయని నివేదికలో వెల్లడించారు. ప్రజారోగ్యానికి ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై ఇవి తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 20న సోలన్ నుంచి సేకరించిన నమూనాలు ఆహార భద్రత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయని తెలిపారు. మొత్తం ఏడు నమూనాలను సీటీఎల్‌లో పరీక్షించగా.. ప్రమాదకరమైన రసాయనం రోడమైన్-బి స్థాయిలు అత్యంత ఎక్కువ మోతాదులో ఉన్నట్టు తేలిందని చెప్పారు. పింక్ మాత్రమే కాకుండా ‘ఆరెంజ్, పర్పుల్, యెల్లో, సీ గ్రీన్, తెలుపు, గ్రీన్ వైలెట్‌లోనూ ఈ రసాయనాలు ఉన్నట్టు తేలింది. మానవ ఆరోగ్యానికి హానికలిగించే రోడమైన్-బి వినియోగిస్తున్నట్టు గుర్తించాం’ అని తెలిపారు.
ఆహారంలో కృత్రిమ రంగులను ఎక్కువగా వాడడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తునే ఉన్నారు. ఆహారంలో కృత్రిమ రంగులు వాడవద్దని, అస్సలు వాటిని ఉపయోగించవద్దని సూచిస్తున్నారు. ఎలాంటి కలర్స్ లేకుండా తయారుచేయాలని పదే పదే చెబుతున్నా నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఇప్పటికే మీచు మిఠాయిని కర్ణాటక, తమిళనాడు, ఏపీలు నిషేధించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa