వాహనదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-ఐఓసీ గుడ్ న్యూస్ చెప్పింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌కు ఏకంగా రూ.15 తగ్గిస్తూ సంచలన నిర్ణయం వెలువరించింది. అయితే ఇది దేశవ్యాప్తంగా కాదు. కేవలం లక్షద్వీప్ దీవుల్లో మాత్రమే ఈ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వర్తించనుంది. మారుమూల ద్వీపాలకు పెట్రోల్, డీజిల్ ఇంధనాన్ని రవాణా చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేసిన సొమ్మును తిరిగి తెచ్చుకునేందుకు ఆ ప్రాంతంలో గతంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. అయితే తాజాగా ఆ ధరలను భారీగా తగ్గించింది.
ఇక లక్షద్వీప్‌లోని పలు దీవుల్లో ఈ తగ్గింపు వేర్వేరుగా ఉంది. కొన్ని దీవుల్లో రూ.15 తగ్గింపు ఉండగా.. మరికొన్ని దీవుల్లో ఆ తగ్గింపు కేవలం రూ.5 మాత్రమే ఉంది. ఆండ్రోట్, కల్పేని దీవుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.15.3 ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తగ్గించింది. అదే సమయంలో కవరత్తి, మినీకాయ్ దీవుల్లో రూ.5.2 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది.
ఈ తగ్గింపు కారణంగా కవరత్తి, మినీకాయ్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.94 నుంచి రూ.100.75కి పడిపోయింది. అదే సమయంలో అందరోట్, కల్పేని దీవుల్లో రూ.116.13 నుంచి రూ.100.75 కి తగ్గించింది. కవరత్తి, మినీకాయ్ దీవుల్లో లీటర్ డీజిల్ ధర రూ.110.91 నుంచి రూ.95.71కి తగ్గింది. అందరోట్, కల్పేని దీవుల్లో లీటర్ రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. లక్షద్వీప్‌లోని నాలుగు దీవులైన కవరత్తి, మినీకాయ్, ఆండ్రోట్, కల్పేని దీవులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేస్తోంది.
ఇక కవరత్తి, మినికాయ్ దీవుల్లో ఐఓసీకి ఆయిల్ డిపోలు ఉన్నాయి. ఈ డిపోలకు కొచ్చి నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరా సాగుతుంది. లక్షద్వీప్, కరత్తి, మినీకాయ్ దీవుల్లో కూడా ఆయిల్ డిపోలు నిర్మించగా.. వాటిని నిర్మించేందుకు ఖర్చు చేసిన డబ్బును వెనక్కి తెచ్చుకునేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డీజిల్, పెట్రోల్ ధరలను లీటరుకు ఏకంగా రూ.6.90 పెంచింది. డిపో నిర్మాణాల ఖర్చును గత 3 ఏళ్లుగా ఐఓసీ రికవరీ చేస్తోంది. మూలధన వ్యయం పూర్తిగా రికవరీ అయ్యిందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. దాంతో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.