పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో గుజరాత్‌లో పాకిస్థాన్‌కు చెందిన 18 మంది శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. అహ్మద్‌బాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపునకు హాజరైన గుజరాత్ హోం సహాయ మంత్రి హర్ష్ సంఘవి వారికి పౌరసత్వం ప్రదానం చేశారు. 2016, 2018 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పాక్, అఫ్గన్, బంగ్లాదేశ్ మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు అధికారం ఉందని ప్రకటన తెలిపింది. ఇప్పటి వరకు విదేశీ శరణార్ధులు 1,167 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు పేర్కొంది.
వికసిత్ భారత్ కల సాకారానికి అందరితో కలిసి పనిచేయాలని ప్రస్తుతం పౌరసత్వం పొందిన వారికి మంత్రి పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి పథంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. భారత పౌరసత్వం పొందిన వారందరినీ ప్రధాన స్రవంతిలో భాగం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని మంత్రి తెలిపారు. పాక్, అఫ్గన్, బంగ్లాలో మతపరమైన వివక్షను ఎదుర్కొని వలస వచ్చిన మైనారిటీలకు సులువుగా, వేగంగా ఇక్కడి పౌరసత్వం ఇచ్చేందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వడం కోసం ఉద్దేశించిన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ (CAA-2019)ని కేంద్ర ప్రభుత్వం మార్చి 11న అమల్లోకి తీసుకొచ్చింది. దీని కింద హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రిస్టియన్లకు ఇక్కడి పౌరసత్వం లభించనుంది.