లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెల్లడించిన ఎన్నికల సంఘం ఫలితాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. నిన్న వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 4 న దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. అయితే...ఇప్పుడు ఈ తేదీలలో మార్పులు చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కమ్‌లో ముందుగానే ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించింది. మిగతా అన్ని చోట్లా జూన్ 4నే ఫలితాలు వెలువడినా...అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్‌లో మాత్రం అంత కన్నా ముందే విడుదల చేయనుంది. జూన్ 2నే ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు ఈసీ అధికారికంగా ఓ ప్రకటన చేసింది.
ఈసారి ఎన్నికల్లో డబ్బు, కండబలం, తప్పుడు సమాచారం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. సోషల్ మీడియా ప్రచారంలో పార్టీలు బాధ్యతయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని సీఈసీ హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో నగదు బదిలీపై గట్టి నిఘా ఉంటుందని, కుల, మత పరమైన విజ్ఞప్తులు కుదరవని తేల్చిచెప్పారు. వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేయరాదన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్‌లలో భారీ ఎత్తున అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నామని గుర్తు చేశారు
దేశంలో మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని అన్ని శాసనసభ స్థానాలకు, వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 26 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తొలివిడత పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై.. జూన్ 1తో చివరి విడతతో ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తామని ఈసీ ప్రకటించింది.