ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్‌లను, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. ప్రత్యేకించి రాష్ట్ర సచివాలయ పరిసర ప్రాంతాల్లోను, కరకట్ట మార్గంలోనూ అనుమతి లేకుండా ఉన్న హోర్డింగ్‌లను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీసివేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను నిర్దేశించారు. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేవారు. శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్ఠంగా అమలు పరిచేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆదివారం అమరావతి సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ‘ఎన్నికల కోడ్ ప్రకారం.. షెడ్యూల్ ప్రకటి ంచినప్పటి నుంచి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లోను 48 గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకు ండా ఉన్న రాజకీయ ప్రకటనలను తొలగించాల్సి ఉంది. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్ఠంగా అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలి. కొన్ని జిల్లాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు ఇప్పటి వరకూ అందకపోవడం వల్ల రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ప్రణాళికను సమగ్ర స్థాయిలో రూపొందించలేకపోయాం. ఈ విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ (ఆదివారం) సాయంత్రంలోపు మా కార్యాలయానికి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలను పంపాలి. సీ-విజిల్‌కు అందే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు, ఎన్నికల సంఘం నుంచి అందే ఫిర్యాదులపై అదే రోజు, మీడియాలో ప్రచురితమయ్యే, ఇతర ఫిర్యాదులపై 24 గంటల్లో చర్యలు చేపట్టాలి’ అని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పలు కేసుల కు సంబంధించి వాస్తవ నివేదికలను తమకు వెంటనే అందజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సెక్టోరల్ అధికారులకు మెజిస్టీరియ ల్ అధికారులు ఇచ్చే ప్రతిపాదనలను వెం టనే హోం శాఖకు పంపాలని మీనా సూచించారు.