వికసిత భారత్, అభివృద్ధి ఆంధ్ర కావాలంటే టీడీపీ - జనసేన - బీజేపీ కూటమినే గెలిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్డీయే సర్కారు ఏర్పడాలని... రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో కూటమి ఎంపీలను పార్లమెంటుకు పంపించాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ అవినీతి సర్కారును అంతం చేయాలన్నారు. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఆవిర్భావం తర్వాత, సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడిన మరుసటి రోజునే... ఆదివారం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద నిర్వహించిన సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ‘భారత్ మాతాకీ.. జై’ అంటూ ప్రసంగం మొదలు పెట్టిన మోదీ.. ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో అభివాదం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వస్తున్నాయని, ఎన్డీయేకు 400 సీట్లు దాటేలా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, వేయించి గెలిపించాలని మూడు పార్టీల కార్యకర్తలను కోరారు. ఎన్డీయే కూటమి ప్రాంతీయ ఆకాంక్షలతోపాటు జాతీయ భావాలు కలుపుకొంటూ అడుగులు వేస్తుందని తెలిపారు. భాగస్వాములు చేరేకొద్దీ కూటమి బలం పుంజుకుంటోందన్నారు.