ఏపీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను ముంచేశాడో యువకుడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరు బండ్లవంక ప్రాంతానికి చెందిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ హైదరాబాదు, బెంగళూరుల్లో నివాసం ఉంటూ నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందర్ని నమ్మించాడు. తమకు పంపిన రెజ్యూమ్‌ల ఆధారంగా ముందుగా డిపాజిట్ రూపంలో కొంత డబ్బు చెల్లిస్తే నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించాడు. నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశాడు.
ఈ క్రమంలో రెండు నెలల పాటు వారందరికి జీతాలు అందజేశాడు. ఆ తర్వాత బోర్డు తిప్పేయడంతో తామంతా మోసపోయామని నిరుద్యోగులు గుర్తించారు. సాఫ్ట్‌వేర్ రంగంతో పరిజ్ఞానం ఉన్న కొంతమంది యువకులు తాము డబ్బు పంపిన ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంకు ఖాతాలు, చిరునామాలను గుర్తించారు. ఇందులో హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని గుంటూరు, అనంతపురం, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైయస్‌ఆర్ జిల్లాల్లోని 400 మందికి పైగా నిరుద్యోగులు ఇతని చేతిలో మోసపోయినట్లు గుర్తించారు. మోసానికి పాల్పడిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ స్వగ్రామం పీలేరు బండ్లవంక అని తెలుసుకున్నారు.
భరత్ చేతిలో మోసపోయిన వారంతా పీలేరు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటపడింది. పోలీసులు మోసగాడి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. యువతకు కుచ్చుటోపీ పెట్టిన నిందితుడి ఆచూకీ మాత్రం దొరకలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటే అప్పులు తెచ్చి కట్టామని, మరి కొందరికి ష్యూరిటీ ఉండి డబ్బు కట్టించామని నిరుద్యోగులు పోలీసులకు చెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరారు.. బాధితులు ఇప్పటి వరకు దాదాపు 400 మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఈ ముఠాలో ఇంకా ఎంత మంది ఉన్నారో బయటపడుతుందంటున్నారు. ఈ వ్యవహారం హైదరాబాదు, బెంగళూరు కేంద్రంగా జరిగిందని అక్కడే కేసు పెట్టాలని బాధితులకు సూచించామన్నారు.