అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. చెరకు తోటకు మంటలు అంటుకోవడంతో ఆర్పేందుకు వెళ్లి.. ఆ మంటల్లోనే చిక్కుకుని రైతు సజీవ దహనమయ్యారు. బుచ్చెయ్యపేటకు చెందిన రైతు సుంకర పోతురాజుకు.. భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు అందరికీ పెళ్లిళ్లు చేశారు. కుమారుడు రాజు తండ్రితో కలిసి పొలం పనులు చేస్తున్నారు. పోతురాజు పాడి పరిశ్రమతో జీవనం సాగిస్తున్నాడు. అలాగ తనకున్న రెండు ఎకరాల్లో చెరకు ఇతర పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది చెరకు నాట్లు వేసేందుకు కొంత దవ్వ తోట (విత్తనం కోసం ఉంచిన తోట) ఉంచుకున్నారు.
చెరకు చెత్తను కాలుస్తున్న సమయంలో పక్కనున్న దవ్వతోటకు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఒక్కడే ఉన్న పోతురాజు తోట కాలిపోతుండటం చూసి తట్టుకోలేకపోయారు. చుట్టూ చూసినా ఎవరూ కనిపించకపోవడంతో ఒక్కడే ధైర్యం చేసి తోటను కాపాడుకునేందుకు వెళ్లాడు. కానీ అనుకోకుండా మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. కొద్దిసేపటి తర్వాత అటుగా వచ్చిన రైతులు మంటల్లో కాలిపోయి విగతజీవిగా పడిఉన్న పోతురాజును చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పరుగున అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆయన్ను చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ ఘటనతో బుచ్చెయ్యపేటలో విషాదం అలుముకుంది. కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.