ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో తహసీల్దారు కార్యాలయ ఆవరణలోని సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి కూడా ముసుగు వేశారు. ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉభయగోదావరి జిల్లాలకు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఇచ్చిన కాటన్ మహాశయుడు ఏ పార్టీకి చెందినవారై ఉంటారని ఇలా చేశారని అధికారుల తీరుపై స్థానికులు సెటైర్లు పేల్చారు. పార్టీలతో సంబంధం లేని కాటన్ విగ్రహానికి ముసుగు వేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కాటన్ విగ్రహానికి ముసుగేయడం ఏంటని కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం ప్రశ్నించారు. అల్లవరం మండలం బెండమూర్లంకలోని కాటన్ విగ్రహానికి ముసుగు వేసిన విషయాన్ని గుర్తు చేశారు బ్రహ్మానందం. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు మినహా మిగతా అన్నింటికీ ముసుగులు వేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులుచెబుతున్నారు. అందుకు అనుగుణంగానే కాటన్ విగ్రహాలకు వేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇదే మండలంలోని కామనగరువు పితానివారిపాలెంలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి మాత్రం ఇంకా ముసుగు వేయలేదని స్థానికులు చెబుతున్నారు.