ఏపీలో జాతీయ రహదారులపై అత్యవసర విమానాల ల్యాండింగ్ రన్ వేను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ-ఒంగోలు మధ్య.. 16వ నంబరు జాతీయ రహదారిపై.. బాపట్ల జిల్లా కొరిశపాడు – రేణింగవరం మధ్య నేషనల్ హైవేపై విమానాల ల్యాండింగ్‌కు ట్రయల్ రన్ నిర్వహించారు. హైవే అథారిటీ రూ.79 కోట్లతో 4.1 కిలోమీటర్ల పొడవైన రహదారిని ప్రత్యేకంగా నిర్మించింది.. ఈ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య హైవేపై విమానాలు దిగనున్నాయి. ట్రయల్ రన్ ఉండటంతో హైవే పై వెళ్లే వాహనాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దారి మళ్లించి.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. అత్యవసర పరిస్థితుల్లో విమానాలను దించే విధంగా.. దేశవ్యాప్తంగా 13 రన్‌వేలను జాతీయ రహదారులను సిద్ధం చేస్తున్నారు.
గతేడాది కూడా కొరిశపాడు వంతెన నుంచి జే పంగులూరు మండలం రేణింగవరం వంతెన వరకు జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం నిర్మించిన రన్‌వేపై ట్రయల్ రన్ నిర్వహించారు.. ఒక కార్గో, నాలుగు జెట్‌లు భూమిపై 100 మీటర్ల ఎత్తులో ప్రయాణించాయి. అప్పుడు ట్రయిల్ రన్ విజయవంతం అయ్యింది. ట్రయల్ రన్ కోసం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లు తొలగించడంతో పాటు రేడియం రంగులు వేశారు. విమానాల సిగ్నల్ కోసం రాడార్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్‌కు వచ్చే విమానాలు రన్‌వేపై వంద మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తాయని వాయిసేన అధికారులు తెలిపారు. దేశంలోని 28 ప్రాంతాల్లో ప్రధానమంత్రి గతిశక్తి మిషన్ కింద ఈ తరహా రన్‌వేల నిర్మాణాన్ని కేంద్రం ప్రారంభించగా.. 13చోట్ల పనులు పూర్తయ్యాయి.
విపత్తుల సమయంలో వినియోగించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల, సింగరాయకొండ వద్ద రెండు ఎమర్జెన్సీ రన్ వేలను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. గత ఏడాది మేదరమెట్ల వద్ద రన్ వే పై నాలుగు కార్గో విమానాలు, ఒక జెట్ విమానంతో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.