ప్రజాగళం సభ.. ఇప్పుడు ఏపీ రాజకీయమంతా దీని చుట్టూనే తిరుగుతోంది. సభ సూపర్ హిట్ అని ఎన్టీయే కూటమి, అందులోనూ మరీ ముఖ్యంగా టీడీపీ నేతలు చెప్తుంటే.. మైక్ సరిగా పెట్టుకోలేనివారు మాతో యుద్ధానికి ఏం సిద్ధమవుతారంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇక సభలో పదేపదే మైక్‌లు మొరాయించడం , అందులోనూ ప్రధాని మోదీ మాట్లాడుతున్న సమయంలో నాలుగైదుసార్లు మైక్ నిలిచిపోవటం చర్చనీయాంశమైంది. ఒక దశలో కూటమి పార్టీలోని కార్యకర్తలకు కూడా ఇది నిరుత్సాహపరిచిందనే చెప్పొచ్చు.
పదేళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి చేరటంతో ఈ ప్రజాగళం సభ ప్రతిష్ఠాత్మకంగా మారింది. అందుకు తగ్గట్లుగానే పార్టీలు కూడా భారీగా జనసమీకరణ చేశాయి. సుమారు 300 ఎకరాల్లో.. ప్రజాగళం సభ కోసం ఏర్పాట్లు చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ప్రధాని మోదీ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి ప్రదర్శించారు. ఈ దశలో మైక్ మొరాయించడం వారిని నిరుత్సాహపరిచింది. అయితే ప్రజాగళం సభ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సోమవారం పలువురు టీడీపీ నేతలు చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
ఆదివారం జరిగిన ప్రజాగళం సభ మీద చంద్రబాబు వారితో చర్చించారు. సభ విజయవంతమైన నేపథ్యంలో ప్రజాగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు సైతం తెలియజేసినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వెల్లడైన నేపథ్యంలో ప్రజాగళం పేరుతో మరిన్ని సభలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని చంద్రబాబు నేతలకు తెలియజేశారు. ఈ సందర్భంగానే ప్రజాగళం సభను విఫలం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని, పలువురు టీడీపీ నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లారట.
ప్రజాగళం సభ- సీఈవోకు కూటమి ఫిర్యాదు
మరోవైపు పల్నాడులో జరిగిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యం మీద ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు కూటమి పార్టీలు ఫిర్యాదు చేశాయి. ప్రధాని పాల్గొన్న సభలో సెక్యూరిటీ వైఫల్యం ఉందని సీఈవోకు ఫిర్యాదు చేశారు. అలాగే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వ్యవహారశైలి మీద కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ప్రధాని పాల్గొనే సభ గురించి పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా.. సరిగా ఏర్పాట్లు చేయలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నలుగురు అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.