మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైన నుపుర్ శర్మ.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు తెగ చర్చనీయాంశంగా మారుతున్నాయి. బీజేపీ తరఫున ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాంధీల కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ స్థానం నుంచి నుపుర్ శర్మ ఎన్నికల బరిలో ఉండనున్నట్లు కాషాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
అయితే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాలను మించి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. కీలక స్థానాల్లో కీలక అభ్యర్థులను బరిలోకి దించుతోంది. అంతే కాకుండా మిత్ర పక్షాలను కలుపుకోవడం, ప్రత్యర్థుల సీట్లను దక్కించుకునేందుకు ఆ స్థానాల్లో గట్టి అభ్యర్థులను దించడం సహా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక దేశంలో అత్యధికంగా 80 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ విజయం సాధించారు. 2004 నుంచి రాయ్‌బరేలీ నుంచి వరుసగా విజయం సాధిస్తున్న సోనియా గాంధీ.. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఎన్నికలకు ముందే రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
ఈ క్రమంలోనే 2 దశాబ్దాలుగా రాయ్‌బరేలీని అంటిపెట్టుకున్న సోనియా గాంధీ వెళ్లిపోవడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా.. రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని.. హస్తం పార్టీ నేతల్లో తీవ్ర చర్చ జరిగింది. కానీ కాంగ్రెస్ హై కమాండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే రాయ్‌బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నుపుర్ శర్మకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం కాషాయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై గత ఎన్నికల్లో పోటీ చేసిన నుపుర్ శర్మ.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 31 వేలకు పైగా ఓట్ల తేడాతో ఆమె కేజ్రీవాల్‌పై ఓటమి పాలయ్యారు.
గత ఏడాది ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్న నుపుర్ శర్మ.. మహమ్మద్ ప్రవక్తపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది తీవ్ర దుమారం రేపడంతో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో నుపుర్ శర్మను బీజేపీ నుంచి బహిష్కరించింది. ఈ విషయం దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల మధ్య రాయ్‌బరేలీ నుంచి నుపుర్ శర్మకు బీజేపీ టికెట్ ఇస్తుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే రాయ్‌బరేలీ నుంచి గాంధీ కుటుంబం పక్కకు జరగడంతో బీజేపీ అభ్యర్థి నుపుర్ శర్మ సునాయాసంగా విజయం సాధిస్తారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు.