మన దేశంలో నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పొగబండ్ల నుంచి నేటి అత్యాధునిక వందే భారత్ రైళ్ల వరకు భారతీయ రైల్వేలు ఎన్నో రకాల రైళ్లను ప్రవేశపెట్టారు. సౌకర్యాలే కాకుండా రైలు వేగం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే సమీప భవిష్యత్‌లో భారతదేశంలో బుల్లెట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ క్రమంలోనే బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బుల్లెట్ రైలు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పేశారు. అది కూడా ఏ మార్గంలో దేశంలోనే ఈ తొలి బుల్లె్ట్ రైలు పరుగులు పెట్టనుందనే విషయాలను వెల్లడించారు.
2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు పట్టాలు ఎక్కనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న అశ్వినీ వైష్ణవ్.. బుల్లెట్ రైలు ప్రాజెక్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుజారాత్‌లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై మధ్య మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రయాణించనున్నట్లు వివరించారు. ఇప్పటికే అహ్మదాబాద్ - ముంబై హై స్పీడ్ రైలు కారిడార్ నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.
ఈ మార్గంలోనే దేశంలో తొలి బుల్లెట్ రైలు సర్వీసును 2026 నాటికి ప్రారంభిస్తామని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. మొదటగా గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు ఈ బుల్లెట్ రైలును నడపనున్నట్లు వివరించారు. ఆ తర్వాత 2028 నాటికి ముంబై – అహ్మదాబాద్ పూర్తి మార్గం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 508.17 కిలోమీటర్ల దూరాన్ని ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 3 గంటల్లోపే ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ముంబై - అహ్మదాబాద్ మధ్య 508.17 కిలోమీటర్ల దూరం ఈ హై స్పీడ్ రైలు కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకునే అవకాశం ఉంటుంది. జపాన్ షింకన్‌సెన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ముంబై - అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. మొత్తం రూ.1.10 లక్షల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని కేంద్రం భావించినప్పటికీ భూసేకరణలో అడ్డంకులు ఎదురు కావడంతో ఆలస్యం అయింది. 2026 నాటికి దక్షిణ గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య మొదటి దశ బుల్లెట్ రైలును నడపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.