2019 సార్వత్రిక ఎన్నికల ముందు ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టాన్ని 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఏఏను వ్యతిరేకిస్తూ తాజాగా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ భారీగా పిటిషన్లు నమోదు అయ్యాయి. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పలు సంఘాలు, రాజకీయ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా విచారణ జరపనున్నారు.
సీఏఏను సవాల్ చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్-ఐయూఎంఎల్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-డీవైఎఫ్ఐతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సహా మొత్తం 237 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. సీఏఏను కేంద్ర హోం శాఖ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు వెలువరించిన తర్వాతి రోజే ఐయూఎంఎల్, డీవైఎఫ్ఐ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పౌరసత్వ సవరణ చట్టం ముస్లిం కమ్యూనిటీ పట్ల వివక్ష చూపిస్తోందని దాన్ని అమలు చేయడం నిలిపివేయాలని కోర్టును కోరారు.
గతంలో 2019 లోనే పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందగా.. అప్పుడే అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. కానీ సీఏఏ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని కారణంగా కోర్టు దాని అమలును నిలిపివేయలేదు. నిబంధనలను నోటిఫై చేయని కారణంగా అసలు నిలిపివేసే ప్రశ్నే లేదని శుక్రవారం సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అనంతరం వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్నికలకు ముందే నిబంధనలను నోటిఫై చేశారని చేస్తున్న వాదనలు అవాస్తవవాలని పేర్కొన్నారు.
ఈ సీఏఏ కింద పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన హింసకు గురై.. శరణార్థులుగా భారత్‌కు వలస వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు, జైనులు, బౌద్ధులకు భారత పౌరసత్వం కల్పించనున్నారు. 2014 డిసెంబర్ 31 వ తేదీ లోపు వచ్చిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించారు. అయితే ఇందులో ముస్లింలకు అవకాశం కల్పించకపోవడమే తీవ్ర దుమారానికి కారణం అయింది. దీంతో ప్రతిపక్షాలు నరేంద్ర మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పార్లమెంటు ఆమోదం పొందిన 4 ఏళ్ల తర్వాత సీఏఏ నిబంధనలను నోటిఫై చేయడం.. అది కూడా సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు చేయడంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎన్నికల్లో ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఓట్లు పొందేందుకు బీజేపీ ఈ ప్రయత్నం చేస్తోందని జైరాం రమేష్ ఆరోపించారు.
తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సీఏఏ వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పౌరుల హక్కులను హరించే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. సీఏఏ హక్కులు కల్పిస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారని.. కానీ ఎప్పుడైతే పౌరసత్వం కోసం దరఖాస్తు చేస్తారో అప్పుడు అక్రమంగా చొరబడిన శరణార్థులు అవుతారని.. అప్పుడు హక్కులు కోల్పోతారని పేర్కొన్నారు. అందుకే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేముందు ఆలోచించాలని సూచించారు.
అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్రం కొట్టి పారేస్తోంది. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. ఇప్పుడు అమలు చేయడంపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన కేంద్రమంత్రి అమిత్ షా.. 2019 మేనిఫేస్టోలోనే శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా సీఏఏ అమలు ఆలస్యం అయిందని తెలిపారు.