పిఠాపురం మనదే. ఈ సీటు గెలిచి చూపించాలి. మూలాలు ఇక్క డే ఉన్నాయి. పిఠాపురం మొదలుకుని అన్నీ గెలుద్దాం. 21 ఎమ్మెల్యే సీట్లతో పాటు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలు గెలిచి తీరాలి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మన వరకు పిఠాపురంలో ఎన్నికలు అయిపోయాయి. ఓటు వేయడం, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలింది అని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పిఠాపురం నాయకులతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పిఠాపురం నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం తనకు ప్రత్యేకమైన నియోజకవర్గమని, రాజకీయం కంటే కూడా నియోజకవర్గంలోని శ్రీపాద శ్రీవల్లభ భక్తుడినని చెప్పారు. ‘‘2009 నుంచి పిఠాపురంలో పోటీ చేయమని చెబుతుండేవారు. అప్పట్లోనే పోటీ చేయాలని ఆలోచించా. ఇప్పుడైనా నా గెలుపు కోసం పిఠాపురం తీసుకోలేదు. కులాల మధ్య ఐక్యత ఉండాలని, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని, కులాలన్నింటినీ కలుపుకొని వెళ్లాలని భావించా. ఈ రోజు అది సఫలీకృతం అవుతోంది’’ అని వ్యాఖ్యానించారు. పిఠాపురం, భీమవరం, గాజువాక నియోజకవర్గాలు తనకు మూడు కళ్లలాంటివని పవన్ చెప్పారు.