ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగూల్ మీరా డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సొంత బాబాయిని గొడ్డలితో చంపిన వాళ్ల నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారన్నారు. మొన్న కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఇమామ్ హుస్సేన్‌పై వైసీపీ కార్యకర్తల గొడ్డలి వేటు వేశారన్నారు. నిన్న గిద్దలూరులో గిరిజన యువకుడు మునెయ్యను గొడ్డలితో నరికి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ దాడులు, హత్యలు రిటర్న్ గిప్ట్ గా ఇస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్లలో 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు హత్యకు గురయ్యారని తెలిపారు. ఈ కేసుల్లో పోలీసులు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారుల్ని వదలమని హెచ్చరించారు. ‘‘వైసీపీ కార్యకర్తలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. ఎన్నికల తర్వాత జగన్ ఈ రాష్ట్రంలో ఉండరు. రేపు మీ పరిస్ధితి ఏంటో ఆలోచించుకోండి’’ అంటూ హితవుపలికారు.