దెందులూరు మండలం తిమ్మన్న గూడెంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో ఉన్న బెంచ్ పై పలువురు యువకులు కూర్చున్నారు. వాహనంలో వెళ్తున్న అబ్బయ్య చౌదరి.. వారిని చూసి చెయ్యి ఊపారు. వారు టీడీపీ యువకులు కావడంతో ఆయనకి హేళనగా విన్యాసం చేసారు. దీనితో ఆక్రోశం చెందిన అబ్బయ్య చౌదరి అనుచరులు సదరు యువకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంచి మీద ఉన్న యువకులపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పిప్పర దుర్గా ప్రసాద్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఏలూరు సర్వ జన ఆసుపత్రికి తరలించారు. దాడిని వీడియో తీస్తున్న కంచర్ల వెంకటేశ్వర యాదవ్ అనే యువకుడి ఫోన్ లాక్కుని ధ్వంసం చేశారు.