అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి. గన్నవరం సీటు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ నుంచి తమ అభ్యర్థిగా మహాసేన రాజేష్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 94 మందితో ప్రకటించిన తొలి జాబితాలోనే ఆయనకు స్థానం కల్పించారు. అయితే పి.గన్నవరం నియోజకవర్గంలోని జనసేన, టీడీపీలోని కొంతమంది నేతల నుంచి మహాసేన రాజేష్‌కు నిరసనలు ఎదురయ్యాయి. అలాగే గతంలో మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలపట్ల హిందూ, బ్రాహ్మణ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయా వర్గాలకు క్షమాపణలు చెప్పారు మహాసేన రాజేష్. అంతేకాదు పి.గన్నవరంలో పోటీ నుంచి అవసరమైతే తప్పుకుంటానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత మహాసేన రాజేష్ నుంచి కానీ, టీడీపీ అధిష్టానం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
కానీ పి. గన్నవరం టికెట్ జనసేనకు కేటాయిస్తున్నారని ఓసారి.. లేదు లేదు బీజేపీకి కేటాయిస్తున్నారంటూ మరోసారి వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. దీంతో మహాసేన రాజేష్ పెదవి విప్పారు. పి. గన్నవరం అభ్యర్థిత్వం విషయంలో తన మనసులోని మాటను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బయటపెట్టారు. నియోజవర్గంలోని బీజేపీ, జనసేన నేతలు తనను అవమానిస్తున్నారని మహాసేన రాజేష్ వాపోయారు.
" పి. గన్నవరం నియోజకవర్గంలో నన్ను జనసేన, బీజేపీ నేతలు అవమానిస్తున్నారు. చంద్రబాబు గారు గొప్ప మనసుతో నాకు తొలి జాబితాలోనే సీటు ఇచ్చారు. అయితే అప్పటి నుంచి మొదలు బీజేపీ, జనసేన, టీడీపీలోని కొంతమంది నాయకులు నాకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. దాన్ని అలా అలా.. పైకి తీసుకెళ్లి బ్రాహ్మణులు, హిందువులకు అంటగట్టారు. ఆ తర్వాత నేను కూడా నా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చా. ఇప్పుడేమో పి. గన్నవరం సీటును బీజేపీ ఆశిస్తోందని వార్తలు వస్తున్నాయి. అమలాపురం టీడీపీకి, పి. గన్నవరం జనసేనకు ఇచ్చారని వార్తలు రాశారు" అని మహాసేన రాజేష్ అన్నారు.
" పి. గన్నవరంలో టీడీపీ ఇంఛార్జిగా నేను ఉన్నా. నన్ను తీసేస్తున్నానని చంద్రబాబు గారు ఇంకా చెప్పలేదు. ఆయన చెప్పకముందే.. బీజేపీ, జనసేన నేతలు ఇలా చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారంటే నాకెంతో ఇష్టం . జనసేన పార్టీ కోసం రెండున్నరేళ్లు పనిచేశా. అలాంటిది నా సీటునే జనసేన కోరుతోంది అంటే నన్ను అవమానించినట్లేనని అనిపిస్తోంది. నేను ఏ పదవి ఆశించకుండా టీడీపీలోకి వచ్చా. జగన్‌ను ఓడించడమే మా టార్గెట్. చంద్రబాబు తొలివిడతలో ప్రకటించిన 94 సీట్లల్లో ఏ ఒక్క సీటునైనా బీజేపీ, జనసేన ఆశించాయా.. నా విషయంలోనే, పి. గన్నవరం సీటులోనే ఎందుకు. నేను ఏం పాపం చేశా" అని మహాసేన రాజేష్ ప్రశ్నించారు.
"నేను కోనసీమకు వెళ్లడం మా సొంత పార్టీలోని, సొంత కులంలోని కొంతమంది నేతలకు నచ్చదు. అయినా కూడా వాళ్లందరినీ నేను గౌరవించా. మహాసేన రాజేష్‌కు సీటిస్తే పక్క నియోజకవర్గాలలోనూ ఓడిపోతుందని చెప్తున్నారంట. నా వల్ల పార్టీ ఓడిపోతుందని అనుకుంటే నేను పార్టీలోనే ఉండను. చంద్రబాబు నుంచి ప్రకటన రాకుండా, నేను నియోజకవర్గ ఇంఛార్జిగా ఉండగానే.. ఈ ఐవీఆర్ఎస్ సర్వేలు చేసి నన్ని అవమానించకండి. అన్నయా నీకు టికెట్ ఉందా లేదా అని కార్యకర్తలు ఫోన్ చేస్తున్నారు. పార్టీ నుంచి ఆదేశాలు రాకుండా నేను పి. గన్నవరం రాలేను. పార్టీ నుంచి ఆదేశాలు రాగానే నేను నియోజవర్గంలోకి వస్తా" అని మహాసేన రాజేష్ చెప్పారు.
"15 రోజుల నుంచి నేను ఈ బాధపడుతున్నా. ఇక భరించలేను. పార్టీ కోసం రాష్ట్రమంతా తిరుగుదామని అనుకున్నా. ఆ పని కూడా ఆగిపోయింది. నేను ఇంఛార్జిగా ఉండగానే ఈ సీటును బీజేపీ అడిగితే ఎలా? నియోజకవర్గంలో నాకు వ్యతిరేకత లేదు. నిరసనలు లేవు. నా మాటలను హిందూ సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు అర్థం చేసుకున్నాయి. నా క్షమాపణలు స్వీకరించి నిరసనలు ఆపేశారు. ఇప్పుడేమో జనసేన, బీజేపీకి టికెట్ అంటున్నారు. ఏంటీ నాకీ టార్చర్. పదవుల కోసం అవమానం జరిగినా పడుండే రకం కాదు నేను. నా ఓటింగ్ ఎంతో చూపించాలా. అందుకు కూడా రెడీ. నాకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు చంద్రబాబు జైళ్లో వెళ్లినప్పుడు ఎక్కడున్నారు. భువనేశ్వరమ్మకు అవమానం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్లారు" అంటూ రాజేష్ ఆవేదన వెళ్లగక్కారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa