తాను కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన సామాన్య రైతు బిడ్డనని..తనకు ఒక్క అవకాశం ఇస్తే రైతును రాజును చేస్తానని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం వద్ద శనివారంఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉపాధిలేక ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయం మరుగున పడుతుందని జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపాధి కల్పించే విధంగా రాజానగరంను అభివృద్ధి చేస్తానని బలరామకృష్ణ పేర్కొన్నారు. వైసీపీలో కుదేలైన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కాలువల్లో పూడిక తీసి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామన్నారు. గోదావరి ప్రక్కనే ఉన్న మంచినీరు అందక గొంతు ఎండుతుందన్నారు. ప్రతి ఇంటికి విద్య, వైద్య, సంక్షేమం, రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మేలైన పాలన అందిస్తామన్నారు. సమావేశంలో జనసేన నాయకులు డాక్టర్ అడపా శ్రీనివాస్, అద్దాల శ్రీనివాస్, భూషణం, తాతాజీ, రాంబాబు, బాపిరాజు, మట్టా సత్యనారాయణ పాల్గొన్నారు.