నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి జరిగి కనీసం నెల తిరగకుండానే కొత్త పెళ్లి కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకూ పెళ్లికళతో కలకలలాడిన ఆ ఇల్లు.. ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఊహించని విధంగా పెళ్లి కొడుకు చనిపోవటం రెండు కుటుంబాల్లో అంతులేని వేదనను మిగిల్చింది. అసలు వివరాల్లో వెళ్తే..శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లక్కరాజుపల్లిలో విష్ణువర్ధన్ రెడ్డి అనే యువకుడు సచివాలయ సర్వేయర్‌గా పనిచేస్తు్న్నారు. అతనికి 11 రోజుల క్రితమే పెళ్లి జరిగింది.
అయితే పెళ్లికి వేసిన పందిళ్లు వాడకుండానే ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో మోటార్లో ఇబ్బంది ఎదురైంది. మోటార్ పనిచేయడం లేదని రైతు చెప్పడంతో విష్ణువర్ధన్ రెడ్డి దానిని రిపేర్ చేసేందుకు వెళ్లారు. విష్ణువర్ధన్ రెడ్డి మోటార్ మరమ్మత్తు చేస్తున్న సమయంలో.. కరెంట్ షాక్ కొట్టడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని భోరున విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే పెళ్లైన పదిరోజులకే ఊహించని విధంగా పెళ్లికొడుకు చనిపోవటం ఆ కుటుంబాలనే కాదు గ్రామస్థులను సైతం కలిచివేసింది. అప్పటిదాకా పెళ్లి సంబరంలో ఉన్న రెండు కుటుంబాలు.. ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.