టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆస్పత్రి పాలయ్యారు. సత్యనారాయణ మూర్తి అనారోగ్యానికి గురికావటంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. స్వగ్రామం వెన్నెలపాలెంలో ఉన్న సమయంలో బండారు సత్యనారాయణమూర్తి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు అప్పలనాయుడు ఆసుపత్రి వద్ద వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ పేరు చెప్తే గుర్తుకువచ్చే ముఖ్యమైన నేతలలో బండారు సత్యనారాయణ మూర్తి ఒకరు. 1985 నుంచి బండారు టీడీపీలో పనిచేస్తున్నారు. పరవాడ నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన బండారు సత్యనారాయణ మూర్తి.. మంత్రిగానూ వ్యవహరించారు. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ కీలకనేతగా ఎదిగారు. 2004లో పరవాడలో గండి బాబ్జీ చేతిలో ఓడిపోయిన ఆయన.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో పెందుర్తి నుంచి పోటీ చేశారు. అయితే అప్పటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు చేతిలో ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి మరోసారి గెలిచిన బండారు.. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి అదీప్ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు.
2024 ఎన్నికల్లో టీడీపీ తరుఫున పెందుర్తి నుంచి మరోసారి బరిలోకి దిగాలని బండారు సత్యనారాయణ మూర్తి ఆశించారు. అయితే పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. అక్కడి నుంచి పంచకర్ల రమేష్ బాబు బరిలోకి దిగుతున్నారు. దీంతో బండారు సత్యనారాయణ మూర్తి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఒక దశలో ఆయన వైసీపీ తరుఫున అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. వైసీపీ నేతలు ఆయనతో టచ్‌లోకి వెళ్లారని.. త్వరలోనే వైసీపీలో చేరతారని వార్తలు వెలువడ్డాయి. అయితే వాటిపై బండారు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఏళ్ల తరబడి సేవ చేసిన పార్టీ.. తనకు టికెట్ ఇవ్వకపోవటం, ప్రత్యామ్నాయం కూడా సూచించకపోవటం బండారును కలిచి వేసిందని అనుచరులు చెప్తున్నారు. ఆ బెంగతోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి.