విజయవాడ నగరంలో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయారు. నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో వీరంగం సృష్టించారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బస్టాండులోని పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫుల్లుగా మద్యం తాగిన యాచకులు, బ్లేడ్ బ్యాచ్ బస్టాండ్‌లోని బెంచీలను ఆక్రమించుకుని నిద్రపోయారు. దీంతో అసౌకర్యానికి గురైన ప్రయాణికుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్టాండ్‌కు చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది.. వారిని అక్కడి నుంచి పంపించేందుకు చర్యలు చేపట్టారు.
ఈక్రమంలో నిద్రలేపడానికి ప్రయత్నించగా పోలీసులపై ఈ ముఠాలు తిరగబడ్డాయి. ఒక్కసారిగా దాదాపు 100 మందికిపైగా దూసుకువచ్చారు. బ్లేడ్లతో దాడికి యత్నించడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఈ దాడిలో ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకరికి గాయాలయ్యాయి. ఘటనతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు.. చెల్లాచెదురయ్యారు. అనంతరం అదనపు పోలీసుల రాకతో నిందితులు పరారయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. రైల్వేస్టేషన్ లోపలికి యాచకులు, బ్లేడ్ బ్యాచ్‌ను రాకుండా అడ్డుకోవడంతో వారంతా బస్టాండ్‌కు వస్తున్నారు. అక్కడి నుంచి తమను బయటకు పంపడాన్ని నిరసిస్తూ వారు దాడికి దిగారు.