ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థుల పేర్లతో భారతీయ జనతా పార్టీ ఐదో జాబితా విడుదల చేసింది. ఏపీలోని ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆదివారం ఉదయమే పార్టీలోకి చేరిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు బీజేపీ తిరుపతి ఎంపీ సీటు కేటాయించింది. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి లోక్‍సభ స్థానం నుంచి సీఎం రమేష్, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నర్సాపురం నుంచి శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేయనున్నారు.
అరకు- కొత్తపల్లి గీత
అనకాపల్లి - సీఎం రమేష్
రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
నర్సాపురం- భూపతిరాజు శ్రీనివాసవర్మ
తిరుపతి- వరప్రసాదరావు
రాజమండ్రి- దగ్గుబాటి పురంధేశ్వరి
మరోవైపు నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో నర్సాపురం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన తరుఫున ఏదో ఒక పార్టీ తరుఫున పోటీ చేస్తానంటూ చెబుతూ వచ్చారు. అయితే ఊహించని విధంగా నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మను బీజేపీ బరిలోకి దింపుతోంది. అలాగే తిరుపతి ఎంపీ సీటుకు వైసీపీ నుంచి ఆదివారం ఉదయమే పార్టీలో చేరిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ను బీజేపీ ఎంపిక చేసింది.
వరప్రసాద్‌కు మరోసారి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించింది. దీంతో ఆదివారం ఉదయమే ఆయన బీజేపీలో చేరారు. సాయంత్రానికి తిరుపతి ఎంపీ సీటును బీజేపీ అధిష్టానం ఆయనకు కేటాయించింది. అలాగే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్‌ను సైతం ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలబెడుతోంది కమలం పార్టీ. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్‌ను తొలిసారిగా అనకాపల్లి నుంచి లోక్‌సభ బరిలో నిలబెడుతోంది. మరోవైపు ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆరు ఎంపీ సీట్లకు కమల దళం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది.