రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం జరిగిన మారణకాండలో మృతుల సంఖ్య 150 దాటింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ 150 మంది చనిపోయారని, క్షతగాత్రుల సంఖ్య 200 దాటిందని తెలిపారు. క్రాకస్ సిటీ హాలులో రష్యాకు చెందిన ప్రముఖ బ్యాండ్ పిక్‌నిక్ ఈవెంట్ జరుగుతుండగా.. సాయుధులైన దుండుగులు నరమేధానికి తెగబడిన విషయం తెలిసిందే. తొలుత బాంబుపేలుళ్లకు పాల్పడిన ముష్కరులు.. ఆ తర్వాత కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురు సహా 11 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
ఇక, ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్టు రష్యా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఉక్రెయిన్‌తో కాంటాక్ట్ అయిన దుండగులు.. ఆ దేశం సహకారంతోనే సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబడ్డారని ఫెడరల్ సెక్యూరిటీ బ్యూరో ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవని అమెరికా తెలిపింది. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే ప్రకటించుకుంది. ఉగ్రదాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా స్పందించారు. ఈ ఘటనను అనాగరిక చర్యగా అభివర్ణించిన ఆయన, దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఆయన హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాపదినం పాటించాలని పుతిన్ పిలుపునిచ్చారు.
‘రక్తపాతం సృష్టించిన ఉగ్రవాద చర్యకు సంబంధించి నేను ఇవాళ మీతో మాట్లాడుతున్నాను.. ఈ ఘటనలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 24న దేశవ్యాప్తంగా సంతాపదినంగా ప్రకటిస్తున్నా’ అని పుతిన్ పేర్కొన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 11 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నామని, వారిని ఉపేక్షించబోమని పుతిన్ తేల్చి చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.