తణుకు, భీమవరం, ఆకివీడు మీదుగా నడిచే కాకినాడ– చెన్నై సర్కార్ ఎక్స్‌ప్రెక్స్ పాండిచ్చేరి వరకు పొడిగించారు. ప్రస్తుతం వారంలో మూడు రోజులు మాత్రమే నడుస్తోంది. ఆది కూడా ఆది, బుధ, గురువారాల్లో, తిరుగు ప్రయాణాల్లో సోమ, గురు, శుక్రవారాల్లో పాండిచ్చేరి నుంచి కాకినాడ వరకు నడుస్తోంది. ఇక మిగిలిన నాలుగు రోజులు యాధావిధిగా కాకినాడ పోర్టు నుంచి చెంగల్‌పట్టు వరకు నడుస్తోంది. ఈ రైలు 1967లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఆత్తిలి, తణుకు, భీమవరం, ఆకివీడు మీదుగానే చెన్నై వెళుతుంది. చెన్నై వెళ్లే ప్రయాణికులు ఈ రైలులో వెళ్లేందుకే ఇష్టపడుతుంటారు. కొంతకాలం నుంచి ఈ రైలును పాండిచ్చేరి వరకు పొడిగించాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన చాలామంది పాండిచ్చేరిలో నివాసం ఉంటున్నారు. వీరు అక్కడ నుంచి రావాలంటే చెన్నై సెంట్రల్, లేదా చెంగల్ పట్టుకు రావాల్సి వస్తున్నది. సదరన్ సెంట్రల్ రైల్వే ఈరైలును పొడి గించేం దుకు అనుమతి నివ్వలేదు. దీంతో ఏళ్ళ తరబడి ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. ఈ తరుణంలో నరసాపురం నుంచి నేరుగా పాండిచ్చేరికి వారంలో ఒక్క రోజు వీక్లి ఎక్స్‌ప్రెస్ నడిపేందుకు ప్రతిపాదన పెట్టింది. దీనికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను పొడి గించమని విజయవాడ డివిజన్ ఆధికారులు విజ్ఞప్తి చేశారు. దానికి సదరన్ రైల్వే పచ్చజెండా ఊపింది.ఈ ఏడాది జూలై వరకు ఈ రైలును వారానికి మూడు రోజులు నడప నున్నారు. ఆ తరువాత వారంలో అన్ని రోజులు నడుస్తోంది. ప్రస్తుం ఈరైలు పాండిచ్చేరికి ఉదయం 9.50గంటలకు చేరుకుంటుంది. తిరిగి పాండిచ్చేరిలో మధ్యాహ్నం 1.30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం భీమవరం 4.40, తణుకు 5.13కి వస్తుంది.