అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించిన ఈ నియోజకవర్గం నుంచి రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత సీఎం రమేశ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదివారం అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేశ్ పేరును ప్రకటించింది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా (ఎన్‌డీఏ) ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలు వుండగా... టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరకముందు ఎంపీ సీటుతోపాటు రెండు అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ, మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని భావించాయి. అయితే టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ జట్టు కట్టడంతో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని బీజేపీకి విడిచిపెట్టారు. అసెంబ్లీ స్థానాల్లో మార్పులేదు. నాలుగుచోట్ల టీడీపీ, రెండు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల తరపున ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. రాష్ట్రానికి సంబంధించి బీజేపీ శనివారం వరకు ఒక్క జాబితాలను కూడా విడుదల చేయకపోవడంతో అనకాపల్లి ఎంపీ టికెట్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ఎవరికి కేటాయిస్తుందన్న దానిపైఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ పేరు తెరపైకి వచ్చింది. ఇంకా ఒకటి, రెండు పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ సీఎం రమేశ్ పేరునే అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో రానున్న ఎన్నికల్లో జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కూటమి తరపు పోటీ చేస్తున్న అభ్యర్థులపై స్పష్టత వచ్చేసింది.