రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడితే... మొట్టమొదట సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని మందకృష్ణ కోరారు. రాజ్యాంగబద్ధ సంస్థల్లో మాదిగ వర్గానికి తగు ప్రాధాన్యం ఇవ్వాలని, కార్పొరేషన్లలో, నామినేటెడ్ పదవుల్లో మాదిగవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీలకు రద్దు చేసిన అన్ని పథకాలు తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ విషయంలో జగన్ మాదిగలకు అన్యాయం చేశారని, సుప్రీంకోర్డులో వర్గీకరణ విచారణ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లాయర్‌ను కూడా పెట్టలేదని మండిపడ్డారు. మాదిగల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారన్నారు. ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని, మాదిగలంతా నిద్రాహారాలు మాని కూటమి గెలుపు కోసం పనిచేస్తారని తెలిపారు. 30న గుంటూరులో ఎన్నికల ప్రచార సరళిపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని, గ్రామ స్థాయినుంచి ఇంటింటికీ కూటమి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబుపై తమకు నమ్మకముందన్నారు. 29 రిజర్వుడ్ సీట్లలో జగన్ మాదిగలకు కేవలం పది స్థానాలు మాత్రమే ఇచ్చారని, టీడీపీ పోటీచేసే 24లో చంద్రబాబు 14 మాదిగలకు కేటాయించారన్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేసే రిజర్వుడ్ స్థానాల్లో మూడింట్లో ఒకటి మాదిగలకు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. గతంలో రాజ్యసభ స్థానం వర్ల రామయ్యకు చేజారిందని, ఈ సారి కచ్చితంగా ఆయనకు ఇవ్వాలని కోరామన్నారు. ఎన్డీయే కూటమి గెలుపు మాదిగల గెలుపుగా భావిస్తామని మందకృష్ణ పేర్కొన్నారు.