ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాలు, అసెంబ్లీ నియోజక వర్గాల్లో టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయ్యింది. నరసాపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మను ఎంపిక చేసినట్లు పార్టీ అధిష్టా నం ఆదివారం ప్రకటించింది. కైకలూరు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కామినేని శ్రీనివాసరావు పేరు దాదాపు ఖరారైంది. సోమవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధికారికంగా ప్రకటించింది. నర సాపురం లోక్‌సభ నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ పక్షాన రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మ అభ్యర్థిత్వాన్ని ఆదివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ స్థానం నుంచి పోటీకి నేతలు వర్మ, పాకా సత్యనారాయణ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. చివరకు సాధారణ కార్యకర్త నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన శ్రీనివాసవర్మకు చాన్స్ ఇచ్చారు. సాధారణ కార్యకర్త గుర్తింపు ఇదే నిదర్శనమని, అందరిని కలుపుకుని పోవడం ద్వారా కచ్చితంగా నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందడం ఖాయమని శ్రీనివాసవర్మ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు.