ఏపీలో ఎన్నికల కోడ్ నడుస్తోంది. పోలీసులు ఎక్కడికక్కడే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమ మద్యంపై నిఘా పెంచారు.. కొద్దిరోజులుగా కర్ణాటక-ఏపీ సరిహద్దులో భారీగా మద్యాన్ని సీజ్ చేశారు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ ఎత్తున మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కుప్పంలో ఎన్నికల వేల భారీస్థాయిలో మద్యం దొరకడం చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక నుంచి గుడుపల్లి మండలం సోడిగానీపల్లి దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు. ఓ కారు అటువైపుగా రాగా.. అనుమానంతో చెక్ చేస్తే మద్యం దొరికింది. పట్టుకున్న మద్యం విలువ దాదాపు రూ.6 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. ఒక బైక్,ఒక కారును సీజ్ చేసిన పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోబపెట్టేందుకు ఈ మద్యం తరలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అక్రమ మద్యంపై పోలీసులు నిఘాను మరింతగా పెంచారు. అనుమానం వచ్చిన వాహనాలకు క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు.