ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ 6 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు భవిష్యత్ ఏంటనే చర్చ జరుగుతోంది. నరసాపురం నుంచి అవకాశం దక్కకపోవడంతో రఘురామ ఒకింత షాక్‌లో ఉన్నారు. బీజేపీ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు వస్తాయని భావించినా.. టికెట్ దక్కలేదు. రఘురామకు సీట్ కేటాయించకపోవడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికల బరిలో ఉంటారా లేదా అనేది ఉత్కంఠరేపుతోంది.
ఈ క్రమంలో ఎంపీ రఘురామకు సంబంధించి ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి అంచనా నిజమైందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. రఘురామ రాజకీయ భవిష్యత్, జాతకంపై వేణుస్వమి చెప్పిందే నిజమైందని కొందరు వీడియోను షేర్ చేస్తున్నారు. 2021లోనే వేణుస్వామి ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.. అందులో రఘురామ జాతకం గురించి అంచనా వేశారు. రఘురామ కృష్ణరాజుకు ఉగాది తర్వాత ఆయనకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయని.. ఇక ఎంపీగా గెలుపొందడం కష్టమేనని చెప్పుకొచ్చారు. రఘురామ జాతక రీత్యా తర్వాతి టర్మ్‌లో ఎంపీ అయ్యే ఛాన్సే లేదన్నారు. ఆయన జాతకం తన దగ్గర ఉందన్నారు. వేణుస్వామి సినిమా, రాజకీయల్లో సెలబ్రిటీల జాతకాలు చెబుతుంటారు. రెండేళ్లకు ముందే వేణుస్వామి రఘురామ భవిష్యత్‌పై అంచనా వేయగా.. ఆ వీడియో మరోసారి చర్చనీయాంశమైంది.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అంటున్నారు. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ఫోన్లు చేశారని, మెసేజ్లు పంపారన్నారు. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని ఆనందంగా ఉన్నాననీ చెప్పడం లేదన్నారు. తనకు టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించారని చెప్పుకొచ్చారు. ఈ అపజయాన్ని అంగీకరిస్తున్నానని.. జగన్ ఇంత పని చేస్తారని తెలిసినా, ఏ మూలనో ఒక నమ్మకం ఉండడంతో తేలికగా తీసుకున్నానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారని, బీజేపీ నుంచి తనకు టికెట్ రానివ్వరని ముందే పిల్ల సజ్జల వెబ్‌సైట్లు, మీడియా ఛానల్స్‌లో చెప్పారని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. జగన్ ప్రభావం వల్ల నరసాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదని.. నరసాపురం నుంచి పోటీ చేస్తానా ? మరో స్థానం నుంచా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుందన్న రఘురామ.. జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వనని హెచ్చరించారు.
ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా కూటమి విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. జగన్ చీప్ ట్రిక్స్ పని చేయవని.. పదవే అనుభవించాలని కోరిక ఉంటే, జగన్‌కు తలొగ్గితే నాలుగేళ్లపాటు ఢిల్లీలో ఉంటూ అజ్ఞాతవాసం గడపాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.పనికిమాలిన వైఎస్సార్‌సీపీలో చేరి ప్రజలకు అన్యాయం చేశానని భావించడం వల్లే ప్రాణాలకు తెగించి పోరాటం చేశానన్నారు. మంచి ఆశయాలు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నడవాలనే ఉద్దేశంతో, ఎంతోమంది ఆదరాభిమానాలను కురిపిస్తున్నా, టీడీపీ ఉండగా మరో పార్టీ ఎందుకని ఆలోచించానన్నారు.
ఇదంతా మోసం, అన్యాయం అని తాను అనడం లేదన్న రఘురామ, ప్రజల పక్షాన నిరంతరం ప్రశ్నించే గొంతు వినిపించే ప్రయత్నంలో ఉంటానన్నారు. పార్టీలు అన్యాయం చేసినా ప్రజలు అన్యాయం చేయరనే నమ్మకంతో ఉన్నానని.. కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక సమస్యలు ఉండవన్నారు. పక్క పార్టీలోని నిర్ణయాలను సైతం ప్రభావితం చేస్తున్న ప్రస్తుత పాలకపక్షాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రజలతో కలిసి పోరాటం చేస్తానన్నారు.