జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న కాకినాడ జిల్లాలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీకి, రాష్ట్ర కార్యదర్శి పదవికి పోసపల్లి సరోజా రాజీనామా చేశారు. కాకినాడ మాజీ మేయర్ అయిన సరోజ.. జనసేన నుంచి కాకినాడ రూరల్ టికెట్ ఆశించారు. అయితే ఆ టికెట్‌ను పవన్ కళ్యాణ్ పంతం నానాజీకి ప్రకటించారు. దీంతో పోసపల్లి సరోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీలో నిబద్ధతతో పని చేసిన వారికి విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న పాత వారిని పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు.
శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన తనకు కాదని.. కాపు వర్గానికి చెందిన నానాజీకీ సీటు ఇవ్వడం ఏంటని ఆమె ప్రశ్నించారు. సీటు ఇస్తామని చెప్పి ఘోరంగా అవమానించారని సరోజా వాపోయారు. జనసేన పార్టీలో మహిళలకు విలువ లేదన్న సరోజ.. కాకినాడ రూరల్‌లో పంతం నానాజీని ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించారు.
మరోపైపు జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి వలన తాను అనేక ఇబ్బందులు పడ్డానని సరోజా ఆరోపించారు. సమస్యలు చెప్పుకుందామని అనుకుంటే.. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న కాపు నేతలు అయన్ని కలిసేందుకు అవకాశం ఇవ్వరని ఆరోపించారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతిందని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. జనసేనకు కేటాయించిన 21 సీట్లలో ఒక్కటి కూడా శెట్టిబలిజ సామాజికవర్గానికి కేటాయించలేదని.. ఓడిపోయే సీటును మాత్రం మహిళా నేతకు అంటగట్టారని ఆరోపించారు. బీసీలకు ఎనలేని అన్యాయాన్ని జనసేన చేస్తుందని ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమన్నారు. రాజమండ్రికి చెందిన గంటా స్వరూప భర్తతో పాటు పలువురు నాయకులు మరణించినా వారిలో ధైర్యం కల్పనకు జనసేనాని పట్టించుకోకపోగా వారిని ఓదార్చిన దాఖలాలు కూడా లేవన్నారు.
మరోవైపు జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ ముంచేస్తున్నారని సరోజా ఆరోపించారు. జనసేనకు పోల్, బూత్ లెవల్ మేనేజ్‌మెంట్లు లేకపోవడానికి నాదెండ్ల మనోహర్ కారణమని విమర్శించారు. నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ కోవర్టు అని సరోజ ఆరోపించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ జరుగుతున్నదేమిటో గమనించాలని.. లేకపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయని సూచించారు. ఇక జనసేన పార్టీకి రాజీనామా చేసిన సరోజ.. త్వరలోనే రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఏ పార్టీలో చేరాలనుకునేదీ త్వరలోనే చెబుతానని అన్నారు.