ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సీట్ల కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన అసంతృప్త నేతలు పక్కపార్టీలోకి వలస పోతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికార వైసీపీ మరో షాక్ తగిలింది. నంద్యాల జిల్లాలోని నంద్యాల జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్ షర్మిల.. కృష్ణారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే వైసీపీ కోసం ఎంతో కష్టపడినా ఫలితం లేదని.. అందుకే ఆ పార్టీని వీడినట్లు గోకుల్ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరటం సొంతింటికి వచ్చినట్లు ఉందని చెప్పారు.
కృష్ణారెడ్డి దెబ్బ ఆయనకేనా..!
వైసీపీకి రాజీనామా చేసిన నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశించారు. వైసీపీ నుంచి నంద్యాల టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. ఈ క్రమంలోనే నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి, ఆయనకు మధ్య విబేధాలు వచ్చాయి. వర్గ విబేధాల కారణంగా శిల్పా రవి లక్ష్యంగా గోకుల్ కృష్ణారెడ్డి బహిరంగ విమర్శలు చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలోనే లోకల్, నాన్ లోకల్ అంశాన్ని సైతం ఆయన తెరపైకి తెచ్చారు. శిల్పా నాన్ లోకల్ అని, తాను స్థానికుడిని అంటూ గోకుల్ కృష్ణారెడ్డి టికెట్ కోసం ప్రయత్నించారు. అలాగే స్థానికేతరుల చేతుల్లో నుంచి నంద్యాలకు విముక్తి కల్పించాలంటూ ఇటీవల ఆత్మగౌరవ యాత్రలు, మౌనయాత్రలు కూడా చేశారు. అయితే ఇంత చేసినా కూడా.. వైసీపీ అధిష్టానం ఈయన అభ్యర్థనను మన్నించలేదు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి మరోసారి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికే వైసీపీ అవకాశం కల్పించింది. దీంతో అసంతృప్తికి గురైన గోకుల్ కృష్ణారెడ్డి.. కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఆ పార్టీ తరుఫున నంద్యాల నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే మొన్నటి వరకూ వైసీపీలోనే ఉన్న గోకుల్ కృష్ణారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ తరుఫున పోటీకి దిగితే.. అది వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి. నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరూక్ పోటీ చేస్తున్నారు. ఫరూక్ వైపు ముస్లిం సామాజికవర్గాలు మొగ్గు చూపి.. శిల్పా రవి, గోకుల్ కృష్ణారెడ్డి మధ్య వైసీపీ ఓట్లు చీలితే అది టీడీపీ అభ్యర్థికి లాభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.