రాజకీయ పార్టీలను అభిమానించేవారు ఉంటారు. అసలే ఎన్నికల సమయం కావడంతో.. కొందరు వినూత్నంగా తమకు నచ్చిన పార్టీపై వినూత్నంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఓ జంట తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని శుభలేఖల ద్వారా మరింతగా చాటారు. చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను బంధువులు, స్నేహితులకు ప్రచారం చేయాలన్న ఆలోచనతో శుభలేఖలపై వాటిని ముద్రించి తమ అభిమానం చాటుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణనాయుడు వలసకు చెందిన బాసాన శంకర్రావు అన్నపూర్ణముల కుమారుడు కృష్ణారావు వివాహం జరిగింది. ఆ కుటుంబీకులకు తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో అభిమానం. ప్రస్తుతం ఎన్నికలు కావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను తమ కుమారుడి వివాహ శుభలేఖపై ముద్రించి అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ వివాహవేడుకకు బొబ్బిలి నియోజకవర్గ అభ్యర్థి బేబీ నాయన హాజరై దంపతులు కృష్ణారావు, హిమబిందులను ఆశీర్వదించారు. పెళ్లి కార్డుపై చంద్రబాబు నాయుడు చిత్రంతోపాటు ఆరు పథకాల వల్ల కలిగే ప్రయోజనం వివరిస్తూ ఇరువైపులా బొబ్బిలి పార్వతీపురం నియోజకవర్గ అభ్యర్థులు బేబీ నాయన, విజయ్ చంద్రల చిత్రాలను ముద్రించి తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉందని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని వరుడు కృష్ణారావు అన్నారు. ఆ పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.