ఏపీలో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీలు అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉంది. బీజేపీ తాజాగా ఆరుగురు లోక్‌సభ అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే విజయనగరం ఎంపీసీటు బీజేపీకి కేటాయిస్తారనే చర్చ జరిగింది.. కానీ బీజేపీ విజయనగరంనకు బదులుగా రాజంపేట సీటును అడిగింది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో విజయనగరం సీటు టీడీపీకే దక్కింది.. అయితే అక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై టీడీపీ కసరత్తు చేస్తోంది.
విజయనగరం ఎంపీ సీటు నుంచి మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు పేరు పరిశీలిస్తున్నారు. అనూహ్యంగా మరో అభ్యర్థి పేరు తెరమీదకు వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఊహించని విధంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రఘురామ బీజేపీ నుంచి నరసాపురం టికెట్ ఆశించారు.. కానీ కాషాయం పార్టీ మాత్రం రఘురామకు కాకుండా శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది. దీంతో రఘురామకు నిరాశ మిగిలింది.. ఈ క్రమంలో ఆయన టీడీపీలో చేరతారనే చర్చ జరుగుతోంది. ఆయన పేరును విజయనగరం సీటుకు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
విజయనగరం నుంచి మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు గతంలో ఎంపీగా గెలిచి ఉన్నారు. క్షత్రియ సామాజిక ఓటర్లు విజయనగరం పరిధిలో ఉన్నారు. దీంతో రఘురామరాజుకు టీడీపీ నుంచి విజయనగరం సీటు ఇస్తారని ప్రచారం మొదలైంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు ప్రకటించారు. అశోక్ గజపతిరాజు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో రఘురామరాజును విజయనగరం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేది చర్చ జరుగుతోంది.
ఏపీలో లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. నరసాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు టికెట్లు దక్కించుకున్నారు. రాజమహేంద్రవరం టికెట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు, అనకాపల్లి స్థానం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు దక్కింది.
వాస్తవానికి నరసాపురం లోక్‌సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు మొదటి నుంచి పరిశీలనలో ఉంది. టీడీపీ, జనసేన చర్చల్లో కూడా ఆయన పేరే ఉంది. రెండు మూడు రోజుల నుంచే ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని.. శ్రీనివాసవర్మకు ఇస్తున్నారని సూచనలు వచ్చాయి. ఇది పూర్తిగా అనూహ్య పరిణామం అని చెప్పాలి. రఘురామ తనకు సీటు దక్కకపోవడంపై స్పందించారు.. దీని వెనుక సీఎం జగన్ హస్తం ఉందన్నారు. బీజేపీలో కొందరితో కలిసి కుట్ర చేశారన్నారు. అయినా సరే తన పోరాటం కొనసాగుతుందని.. రాబోయే రోజుల్లో పరిణామాలు చూడాలన్నారు.