బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా భార్య మల్లికా నడ్డా కారును దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే ఈ కారు దొంగతనం ఈ నెల 19 వ తేదీన జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతంలో ఈ కారు దొంగతనానికి గురైనట్లు కారు డ్రైవర్ వెల్లడించాడు. కారు చోరీ అయిన తర్వాత వెతికిన డ్రైవర్.. ఎంతకూ కనిపించకపోవడంతో ఆ విషయాన్ని నడ్డా భార్యకు చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కారును వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆ కారు చోరీకి గురైన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఈ నెల 19 వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో మల్లికా నడ్డా కారు దొంగతనానికి గురైంది. మల్లికా నడ్డాకు చెందిన టయోటా ఫార్చునర్ కారును డ్రైవర్ జోగిందర్.. సర్వీసింగ్‌కు తీసుకెళ్లాడు. అయితే సర్వీసింగ్ పూర్తి చేసుకుని.. తిరిగి నడ్డా ఇంటికి చేరుకునే సమయంలో దారి మధ్యలో తన ఇల్లు ఉండటంతో అక్కడ కారును నిలిపి ఉంచి ఇంట్లోకి వెళ్లాడు. భోజనం చేసి బయటికి వచ్చి చూసేసరికి ఆ కారు కనిపించలేదు. ఆ ప్రాంతంలో కారు కోసం తిరిగినా ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కారును వెతికేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మల్లికా నడ్డా కారు కోసం విపరీతంగా గాలింపు చేపట్టిన పోలీసులు.. డ్రైవర్ జోగిందర్ ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. అందులో వారికి ఒక క్లూ దొరికింది. ఆ టయోటా ఫార్చునర్ కారును ఆ నిందితుడు గురుగ్రామ్ దిశగా తీసుకెళ్లినట్లు గుర్తించారు. అయితే ఈ నెల 19 వ తేదీన కారు చోరీకి గురైనా ఇప్పటి వరకు దాని ఆచూకీ లభించలేదు. ఆ కారు హిమాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉంది. హెచ్‌పీ 03 డీ 0021 నంబరు కారు కోసం ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు వెతుకుతున్నారు. ఈ కారు గురించి సమాచారం అందినవారు పోలీసులకు తెలపాలని సూచిస్తున్నారు.