గంధపు చెక్కలు, ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేస్తూ అడవుల్లో బతికిన వీరప్పన్ కుమార్తె ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న విద్యా రాణి.. వృత్తిరీత్యా లాయర్ కాగా.. 2020 లో ఆమె బీజేపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే ఆ పార్టీలో తమిళనాడు బీజేపీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా విద్యా రాణి పని చేశారు. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో పార్టీ మారిన విద్యా రాణి.. తమిళ నటుడు, దర్శకుడు సీమాన్ స్థాపించిన తమిళ్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి-ఎన్టీకేలో చేరారు.
ఈ క్రమంలోనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో విద్యా రాణి ఈ తమిళ్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి-ఎన్టీకే తరఫున బరిలో ఉన్నారు. తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ స్థానం నుంచి విద్యా రాణి లోక్‌సభకు పోటీ పడుతున్నారు. ఇక ఈ పార్టీ తమిళనాడుతోపాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలతోపాటు పుదుచ్చేరిలోని ఒక స్థానానికి పోటీ చేసే మొత్తం 40 మంది అభ్యర్థులను ఎన్టీకే చీఫ్ సీమాన్ ప్రకటించారు. అయితే ఈ 40 మంది అభ్యర్థుల్లో సగం మంది మహిళలేని సీమాన్ స్పష్టం చేశారు.
విద్యా రాణి కృష్ణగిరిలో ప్రస్తుతం ఒక పాఠశాలను కూడా నడుపుతున్నారు. విద్యా రాణి.. ఆమె తన తండ్రి వీరప్పన్‌ను ఒకే ఒకసారి కలిసినట్లు తెలుస్తోంది. తన తండ్రి వీరప్పన్ తన జీవితానికి కొత్త దిశా నిర్దేశం చేశారని విద్యా రాణి గతంలో తెలిపారు. ఆమె చిన్నతనంలో మూడో తరగతి చదువుతున్నప్పుడు తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని గోపీనాథమ్ ప్రాంతలో ఉండే తన తాతయ్య ఇంట్లో తన తండ్రిని చూసినట్లు విద్యా రాణి పేర్కొన్నారు. అయితే అదే మొదటిసారి.. చివరిసారి అని తెలిపారు. వీరప్పన్ - ముత్తులక్ష్మిల రెండో కుమార్తెనే ఈ విద్యా రాణి.