ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. నడుస్తున్న మెట్రో రైలులో ఓ ఇద్దరు యువతులు రెచ్చిపోయారు. తెల్ల బట్టలు వేసుకుని.. ఒకరికొకరు రంగులు రుద్దుకుంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. అయితే ఆ మెట్రో రైలులో ప్రయాణికులు చాలా మందే ఉన్నప్పటికీ వారిద్దరిని మాత్రం ఎవరూ ఆపలేదు. "అంగ్ లగా దే" పాటకు పక్కన ఉన్న జనాలను, పరిసరాలను మర్చిపోయి ఒక మైకంలో డ్యాన్స్ చేశారు. ఒకరిని మరొకరు హగ్ చేసుకుంటూ, కిస్ చేసుకుంటూ మత్తులో మునిగిపోయారు. అయితే ఆ వీడియో పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించగా.. తాజాగా వారికి చెందిన మరో వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఓ యువకుడు స్కూటీ నడుపుతుండగా.. ఇద్దరు యువతులు వెనక కూర్చున్నారు. అయితే ఆ ఇద్దరు యువతులు ఒకరికి మరొకరు ఎదురుగా కూర్చున్నారు. ఇక అదే "అంగ్ లగా దే" పాటకు మొన్నటికంటే ఇంకాస్త డోసు పెంచారు. ఒకరిని ఒకరు హత్తుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ నడిరోడ్డుపై నానా రచ్చ చేశారు. ముందు ఉన్న యువకుడికి హెల్మెట్ లేకపోగా.. అతడు ఆ స్కూటీని రాంగ్ రూట్‌లో నడపడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతే కాకుండా ట్రిపుల్ రైడింగ్, పబ్లిక్ ప్రాంతాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం సహా రకరకాల సెక్షన్ల కింద వారు ట్రాఫిక్ నియమాలను అతిక్రమించినట్లు నోయిడా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. దీంతో వారికి ఏకంగా రూ.33 వేల ఫైన్ విధించారు.
అయితే ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆ స్కూటీ నంబర్ కూడా వెల్లడించారు. యూపీ 16 సీఎక్స్ 0866 నంబరు గల హోండా యాక్టీవా స్కూటీపై ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ వీడియోలకు చిక్కారు. ఆ స్కూటీపై ఇద్దరు యువతులు రొమాన్స్‌తో రెచ్చిపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నెటిజన్లు నోయిడా పోలీసులను ట్యాగ్ చేయగా.. విషయం పోలీసులకు చేరడంతో భారీగా ఫైన్ వేశారు.
ఇక మొన్న ఢిల్లీ మెట్రో రైలులో ఇదే ఇద్దరు యువతులు నానా హంగామా సృష్టించారు. మెట్రో రైలులో కింద ఒక బట్ట వేసి దానిపై రంగులు పోసి.. అక్కడే కూర్చొని ఇదే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఆ రంగులను ఒకరి చెంపలకు మరొకరు రుద్దుకుంటూ ముద్దులు, హగ్‌లతో రెచ్చిపోయారు. అయితే ఆ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే అది డీప్ ఫేక్ వీడియో కావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వారిద్దరి యువతులకు చెందిన మరో వీడియో వైరల్ కావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా చేయడం నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.