వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేటి నుంచి `మేమంతా సిద్ధం` బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తొలుత దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం వైయస్ జగన్ మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.