దేశంలోని టోల్ గేట్లను రద్దు చేస్తూ వాహన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై టోల్ గేట్ల వద్ద ఎక్కువసేపు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న టోల్ విధానాన్ని మారుస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని త్వరలో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న టోల్ గేట్ విధానాన్ని త్వరలో రద్దు చేయనున్నారు. తర్వాత శాటిలైట్ ఆధారిత సాంకేతికతతో టోల్ విధానం అమల్లోకి రానుంది. దీంతో హైవేపై ప్రయాణించేటప్పుడు జీపీఎస్ ఆధారంగా వాహన యజమానుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ వసూలు చేస్తారు. ఈ కొత్త సదుపాయంతో ఇకపై ప్రయాణికులు టోల్ గేట్ల వద్ద నిరీక్షిస్తూ సమయాన్ని వృథా చేయాల్సిన అవసరం ఉండదు.