రాష్ట్రంలో రాక్షస, నిరంకుశ పాలనను అంతమొందించేందుకే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. జగన్మోహన్రెడ్డి పార్టీ విధ్వంసకర పాలనకు చరమగీతం పాడాలని ప్రజలను కోరుతున్నానని పేర్కొన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన పురందేశ్వరి ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలోకి రావాలన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేవలం తమ అభ్యర్థి కోసమేకాకుండా తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరారు. తెలుగుదేశం, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ తరఫున పది అసెంబ్లీ సీట్లు ప్రకటించారని, 11వ సీటు ఉంటుందా లేదా అనేది పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహ ఇన్చార్జి సిద్ధార్థనాథ్సింగ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో జగన్ అవినీతి పెరిగిపోయిందని, శాండ్ మాఫియా, మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా పోవాలంటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.