ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సీఐడీ 2021 డిసెంబర్‌లో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. సీఐడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద స్పందిస్తూ... ఈ వ్యవహారంలో అదనపు దస్త్రాలు కోర్టు ముందుంచేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ పిటిషనర్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని, అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని చెప్పారు. తొందరపాటు చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు అదనపు వివరాలు సమర్పించేందుకు సీఐడీకి సమయం ఇస్తూ విచారణను ఏప్రిల్ 2కి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్‌పై అరె్‌స్టతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి స్పష్టం చేశారు.