ట్రేడింగ్ పేరిట చేసిన ఆన్‌లైన్ మోసంపై సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం రాత్రి పుంగనూరులో సోదాలు నిర్వహించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు గోకుల్‌వీధిలోని ఓ కాంప్లెక్స్‌లో మదనపల్లె ఎన్వీఆర్ లేఅవుట్‌లోని వెంకటప్ప కుమారుడు కన్నప్పగారి మురళి(29) ఎస్‌ఎస్ రీసెర్చ్ అనే పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించారు. కొందరు అమ్మాయిలను పార్ట్‌టైం ఉద్యోగంలో పెట్టుకుని మురళి, వెంకటేశ్.. వారికి స్పోకన్ ట్రేడింగ్‌పై ట్రైనింగ్ ఇచ్చారు. డీమ్యాట్ ఖాతాలున్న కస్టమర్ల ఫోన్ నెంబర్లు వాళ్లకు ఇచ్చారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని వారి చేత ఫోన్లు చేయించి నమ్మించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన భవానీశంకర్ చైతన్యకు ఫోన్ చేసి ట్రేడింగ్‌లో సులభంగా డబ్బు సంపాదనకు టిప్స్ ఇస్తామని, పెట్టుబడి పెట్టాలని కోరారు. దీంతో ఆయన రూ.46,939 చెల్లించగా దానికి రూ.8,059 లాభం వచ్చినట్లు డబ్బు పంపి నమ్మించారు. ఆ తర్వాత భవానీశంకర్ చైతన్య మరో మూడుమార్లు రూ.62 వేలు ఫోన్‌పే ద్వారా డబ్బు పంపారు. ఫోన్ చేసి తన డబ్బులు ఇవ్వాలని ఎస్‌ఎస్ రీసెర్చ్ నిర్వాహకులను అడిగారు. దీంతో వాళ్లు ఫోను స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఆయన సైబరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ ఎస్‌ఐ పి.శ్రీనివాసులు, వారి సిబ్బంది గురువారం పుంగనూరుకు వచ్చి ఎస్‌ఎస్ రీసెర్చ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కె.మురళి, వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకుని పుంగనూరు పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అనంతరం హైదరాబాద్‌కు వారిని తీసుకెళ్లారు.