జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయనగరం జిల్లాలోనూ జరుగనుంది. వచ్చేనెల 4న ఆయన జిల్లాకు రానున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం జనసేన పార్టీకి దిక్కింది. లోకం నాగమాధవి పోటీ చేయనున్నారు. ఉమ్మడి అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు పవన్ వస్తున్నారు. ఆయన వస్తున్నట్లు తెలిసి కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల టీడీపీ నాయకత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారం అందించేలా లోకం నాగమాధవి ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీడీపీ, జనసేన నాయకులతో సమావేశమై అభిప్రాయ బేధాలు లేకుండా చూసుకుంటున్నారు. కేడర్‌లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు పవన్ కల్యాణ్ పర్యటన దోహదపడుతుందని ఆ పార్టీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి. వారాహి యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలన్నదానిపై నాయకులు ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించారు. నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంతో నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రం కలిసి ఉన్న కారణంగా విజయనగరం నుంచి కూడా చాలా మంది యువత, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు అందరూ సంసిద్ధులవుతున్నారు. ఇదే విషయమై జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్విని మాట్లాడుతూ వారాహి యాత్రకు సంబంధించి ఏప్రిల్ 4న జిల్లాకు పవన్ కల్యాణ్ వస్తున్నారని టైమ్ షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉందని వెళ్లడించారు.