ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిట్టింగ్ ఎంపీల్లో సగం మందిపై క్రిమినల్ కేసులు.. 5 శాతం మంది ఆస్తులు రూ.100 కోట్లకుపైనే

national |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 10:11 PM

మరికొన్ని రోజుల్లో ముగియనున్న 17 వ లోక్‌సభలోని ఎంపీలు.. ఎన్నికల అఫిడవిట్‌లో భాగంగా దాఖలు చేసిన పత్రాల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్-ఏడీఆర్ ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో ప్రస్తుతం ఉన్న ఎంపీలలో ఎవరెవరిపై కేసులు ఉన్నాయి.. అందులో క్రిమినల్ కేసులు, తీవ్రమైన నేరాలు ఉన్నవి ఎన్ని.. ఇక ఎంపీల ఆస్తులు ఎన్ని అనే విషయాలను తాజాగా వెల్లడించింది. ప్రస్తుత లోక్‌సభలోని ఎంపీల్లో 44 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. ఇక 5 శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని.. వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది.


17 వ లోక్‌సభలోని 514 మంది సిట్టింగ్‌ ఎంపీలు.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఎన్నికల అఫిడవిట్లు దాఖలు చేసిన మొత్తం 514 మందిలో 225 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈమేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం.. సిట్టింగ్ ఎంపీల్లోని 5 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారని తెలుస్తోంది. ఈ 5 శాతం మంది ఎంపీల ఒక్కొక్కరి సంపద వంద కోట్లకు పైనే ఉంటుందని తెలిపింది.


ఇక క్రిమినల్‌ కేసులు నమోదైన ఎంపీల్లో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఇందులో మొత్తం 9 మందిపై హత్య కేసులు నమోదు కాగా.. వారిలో అందులో ఐదుగురు అధికార బీజేపీ ఎంపీలే కావడం గమనార్హం. ఇక 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదైతే.. వారిలో 21 మంది బీజేపీకి చెందినవారే ఉన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 అత్యాచారం కేసులు నమోదు అయినట్లు ఆ నివేదిక వెల్లడించింది.


మరోవైపు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. అత్యంత ధనిక ఎంపీల్లో రాజస్థాన్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు, కాంగ్రెస్‌ నేత నకుల్‌నాథ్‌ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే సురేశ్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో వైసీపీకి ఇటీవలె రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కనుమూరు రఘురామ కృష్ణరాజు ఉన్నారు.


మరోవైపు.. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సిట్టింగ్ ఎంపీలపైనే ఎక్కువగా క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ఏడీఆర్‌ విశ్లేషణలో వెల్లడైంది. ఈ రాష్ట్రాల్లో ఉన్న ఎంపీల్లో సగం మంది కంటే ఎక్కువ మందిపై కేసులు ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎంపీల విద్యార్హతలను కూడా ఏడీఆర్‌ నివేదికలో పొందుపర్చింది. ఇందులో 73 శాతం మంది ఎంపీలు డిగ్రీలు పూర్తి చేసినట్లు వెల్లడించింది. మొత్తం ఎంపీల్లో కేవలం 15 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com