లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసింది. తాజాగా, రూ.1,700 కోట్లకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పన్ను నోటీసులను సవాల్ చేస్తూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకుంది. తాజా నోటీసు 2017-18 నుంచి 2020-21 సంవత్సరాల అసెస్‌మెంట్‌కు సంబంధించిందని, పెనాల్టీ, వడ్డీ కూడా వేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆదాయపు పన్ను అధికారులు రూ. 200 కోట్ల జరిమానా విధించి, ఖాతాలను స్తంభింపజేయడంతో కాంగ్రెస్ ఇప్పటికే తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ కేసులో హైకోర్టు నుంచి పార్టీకి ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ తమను ఆర్థికంగా దెబ్బతీస్తోందని, ఐటీ అధికారులను తమకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఫిబ్రవరిలో, పార్టీ పన్ను రిటర్న్‌లలో తప్పిదాలను గుర్తించిన ఐటీ అధికారులు రూ. 200 కోట్లు జరిమానా విధించారు. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ బకాయిలు చెల్లించాలని, వారి ఖాతాలను స్తంభింపజేయాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఉత్తర్వులు రావడంతో తమ నిధులను స్తంభింపజేస్తూ ట్రైబ్యునల్ ఉత్తర్వులు ఇవ్వడం ‘ప్రజాస్వామ్యంపై దాడి’గా కాంగ్రెస్ అభివర్ణించింది.
నాలుగు ఆర్ధిక సంవత్సరాల పన్నుల పునః మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు గురువారం తిరస్కరించింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడం అనేది ఈ ఎన్నికలలో ప్రధాన అంశంగా మారుతోంది. ప్రత్యేకించి సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేసిన తర్వాత వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది. బీజేపీకి అత్యంత లాభదాయకమైన పథకాన్ని రద్దు చేసిన తీర్పును కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు స్వాగతించాయి.